అమీర్‌పేట్, సెప్టెంబర్ 14 : ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్ధుల చదువులకు సనత్‌నగర్ సాంకేత్ సంస్థ అందిస్తున్న చేయూత ఆదర్శమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రతిభ ఉన్నా.. ఆర్ధిక కారణాల వల్ల చదువుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్న పేద విద్యార్ధులను గుర్తించి వారికి ఆర్ధికంగా చేయూతనందిస్తూ ఆదుకుంటున్న సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తన 9వ వార్సికోత్సవాన్ని సనత్‌నగర్ కూరగాయల మార్కెట్ బిల్డింగ్‌లోని ఇ-లైబ్రెరీ ఆవరణలో ఘనంగా జరుపుకుంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని చేతుల మీదుగా 14 మంది విద్యార్థులకు రూ.3.06 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ చదువు విలువ తెలిసిన సాంకేత్ ప్రతినిధులు, పేదరికం కారణంగా చదువులకు ఆటంకాలు కలుగకుండా తమ వంతు చేయూతగా అందిస్తున్న ఆర్ధిక చేయూత ఎంతో మంది పేద విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిందన్నారు.
సాంకేత్ ద్వారా ఆర్ధిక సహాయం పొందిన ఎంతో మంది విద్యార్ధులు తమ చదువులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉపాధి పొందుతుండడం అభినందనీయమన్నారు. 2016 నుండి సాంకేత్ సంస్థ ద్వారా ఇప్పటివరకు 57 మంది విద్యార్ధులకు రూ. 16.87 లక్షల చేయూతను అందించడంలో కీలకంగా వ్యవహరించిన సంస్థ అధ్యక్షులు మురళి అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సనత్‌నగర్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డితో పాటు సాంకేత్ ప్రతినిధులు మమత, ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు.