హైదరాబాద్ : గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం(Ganesh Immersion) సందర్భంగా భక్తులు, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani)స్పష్టం చేశారు. 9 రోజుల పాటు ఎంతో గొప్పగా, భక్తిశ్రద్ధలతో వినాయకచవితి ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నవరాత్రుల సందర్భంగా వివిధ కాలనీలు, బస్తీలు, ప్రధాన కూడళ్ళు తదితర ప్రాంతాల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిత్యం పూజలు నిర్వహించడమే కాకుండా అన్న ప్రసాద కార్యక్రమాలను కూడా నిర్వహకులు ఏర్పాటు చేస్తారని వివరించారు.
ప్రతిష్టించిన గణనాథులను కొందరు 3, 5, 9 రోజులకు నిమజ్జనం చేయడం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. గణేష్ నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనంలో దేశంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయాన్ని వివరించారు. నిమజ్జనం సందర్భంగా వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది వస్తారని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.