మన్సూరాబాద్, ఫిబ్రవరి 4: ఆటోనగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ కోసం రూ.30కోట్లు వెచ్చించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతీనగర్ కాలనీలో రూ.23లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అల్లాడి వీరేశం, కళావతిల జ్ఞాపకార్థం కుమారుడు అల్లాడి ప్రవీణ్‌కుమార్ తన సొంతు నిధులు రూ.5.20లక్షలతో ఏర్పాటు చేసిన కాలనీ ముఖ ద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఉన్న వివిధ రకాల పూలమొక్కలను ఇక్కడ ఏర్పాటు చేసి ఆటోనగర్ డంపింగ్ యార్డులో అందమైన ఫ్లవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటోనగర్ పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఫ్లవర్ గార్డెన్ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. వీరన్నగుట్టలోని స్వయంభూ శివాలయాన్ని రూ.10కోట్లతో అభివృద్ధి చేసేందుకు త్వరలో పనులు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే వానకాలంలో లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి విముక్తి చేసేందుకు రూ.103 కోట్ల ఎస్ఎన్డీపీ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎల్బీనగర్ పలు కూడళ్లలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
హయత్‌నగర్ నుంచి కుంట్లూరు వెళ్లే మార్గం, కనకదుర్గ బార్ నుంచి పవనగిరికాలనీ, పుల్లారెడ్డి స్వీట్ హౌజ్ నుంచి ఎల్లారెడ్డి కాలనీ వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టి ప్రజల రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. కాలనీల్లో నూతనంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించడంతో పాటు అసంపూర్తిగా మిగిలిన కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పటోళ్ల కమలారెడ్డి, ప్రధాన కార్యదర్శి వారాల రంగారెడ్డి, కోశాధికారి వి.ప్రదీప్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎండీ మక్సూద్ అలీ, బి.చందునాయక్, సీహెచ్ సత్యనారాయణ, టెంపుల్ కమిటీ గౌరవ అధ్యక్షుడు కేశవులు, చైర్మన్ వెంకటేశ్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉప కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి శ్రీనివాస్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి వెంకన్న కురుమ, బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, పోచబోయిన జగదీశ్‌యాదవ్, కొసనం వెంకట్‌రెడ్డి, బాలరాజుగౌడ్, అత్తాపురం రాంచంద్రారెడ్డి, చెంగల్ చంద్రమోహన్, సిద్దగౌని జగదీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.