Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు పండగలా మారుతాయి. అదే ఊపును మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు ఎప్పటినుంచో చూడాలని కోరుకున్న స్టైలిష్, పవర్ఫుల్ అవతార్‌లో చూపించి సుజీత్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమా కమిట్మెంట్స్ను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా మార్చి నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే పవన్ కళ్యాణ్ చివరి సినిమా కావచ్చని కొంతకాలంగా ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఆ అంచనాలకు పూర్తి భిన్నమైన అప్డేట్ వచ్చింది.
అనూహ్యంగా పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఆయన చేతులు కలపడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా, వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ పవన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచే ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కథ, పవన్ పాత్రకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే, ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ తరువాత ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్ రాలేదు. ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా కథను డెవలప్ చేస్తూ వచ్చినట్లు సమాచారం. కథ పూర్తిగా సెట్ అవడంతోనే పవన్ కళ్యాణ్ ఆమోదం లభించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమాపై సురేందర్ రెడ్డి ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. మొత్తానికి ‘ఓజీ’తో రికార్డులు తిరగరాసిన పవర్ స్టార్, ఇప్పుడు మరోసారి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. రాజకీయ బిజీ షెడ్యూల్ మధ్య కూడా సినిమాలకు సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయితే, ఇప్పటికే ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ మొదలుపెట్టేశారు.