Chiranjeevi |మెగాస్టార్ చిరంజీవికి తన అభిమానులతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ప్రతి వేదికపై వారి గురించి ప్రేమగా ప్రస్తావిస్తూ, తన ప్రయాణానికి అసలైన బలం అభిమానులేనని ఆయన ఎప్పటికప్పుడు చెబుతుంటారు. అదే కృతజ్ఞత భావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఛారిటీలు కూడా ప్రారంభించారు చిరంజీవి. అలాంటి ఆయన తాజాగా ఒక అభిమాని మాటలకు తీవ్రంగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేకంగా ఇండస్ట్రీ హిట్ సెలెబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో మాట్లాడిన చిరంజీవి, ఇటీవల తన దృష్టికి వచ్చిన ఒక లేడీ అభిమాని వీడియోను గుర్తు చేసుకున్నారు.ఆ వీడియోలో ఆ మహిళ చిరంజీవిని ఉద్దేశిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా ఆయన పడుతున్న కష్టాన్ని, ఇంకా అదే నిబద్ధతతో పనిచేస్తున్న తీరును ప్రస్తావిస్తూ భావోద్వేగంగా మాట్లాడిందని చిరంజీవి తెలిపారు. “ఇంతకాలం కష్టపడ్డావు, ఇప్పటికీ ఆగకుండా పనిచేస్తున్నావు. కేవలం డబ్బుకోసం నువ్వు ఇలా చేస్తున్నావని నేను నమ్మను. నిన్ను అలా కష్టపడుతూ చూడటం కొంచెం బాధగా ఉంది” అంటూ ఆమె చెప్పిన మాటలు తన హృదయాన్ని తాకాయని చిరంజీవి చెప్పారు.
ఆ అభిమాని మాటలు తనను ఎంతగానో కదిలించాయని, అలాంటి అభిమానులు తన జీవితంలో ఉండటం తన అదృష్టమని చిరంజీవి భావోద్వేగంగా వెల్లడించారు. ఆ తల్లికి ఈ వేదిక మీద నుంచే ధన్యవాదాలు తెలుపుతూ, అభిమానుల ప్రేమే తనకు అసలైన శక్తి అని అన్నారు. “మీరు సంతోషపడాలంటే ఎంత కష్టమైనా పడతాను. ఆ కష్టంలోనే నాకు ఆనందం దొరుకుతుంది. అభిమానుల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీతోనే నేను ముందుకు సాగుతున్నాను. ఈ జన్మ ఉన్నంత వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాను” అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్నవారిని కదిలించాయి. ఈ మాటలతో మరోసారి అభిమానుల పట్ల చిరంజీవికి ఉన్న అపారమైన ప్రేమ, కృతజ్ఞత స్పష్టంగా కనిపించిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.