ఎల్బీనగర్ , జూన్ 10 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు కాలనీల మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం కోసం అదనంగా రూ. 40 కోట్ల నిధులను మంజూరు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy)కోరారు. సోమవారం జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డిని(Sudarshan Reddy) ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలోని డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు డ్రైనేజీ, మంచినీటి సమస్యలను జలమండలి ఎండీ దృష్టికి తెచ్చామన్నారు.
ప్రధానంగా గతంలో దాదాపు 80 కిలోమీటర్ల మేర నూతన వాటర్ లైన్లతో పాటుగా సుమారు రూ.50 కోట్లతో భూగర్బ డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామన్నారు. తాజాగా భూగర్బ డ్రైనేజీ వ్యవస్థ కోసం అదనంగా మరో రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. గతంలో తాము ప్రతిపాదించిన మరో 18 కిలోమీటర్ల మేర నూతన వాటర్ లైన్లు వేసేందుకు అదనంగా మరో రూ. 40 కోట్లను మంజూరు చేయాలని జలమండలి ఎండీని కోరినట్లు ఆయన తెలిపారు.