ఎల్బీనగర్, మే 29 : ‘ప్రజల కోసం ఉన్న భవనాలు ప్రజలకే చెందాలి.. పోలీస్‌స్టేషన్ అవసరమైతే స్టేషన్‌కు కేటాయించిన 3000 గజాల జీవో ఎందుకు రద్దు చేశారు ? ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల స్వరం వినాలి.. ప్రజల, కాలనీవాసుల హక్కులను కాపాడాలి. వార్డు కార్యాలయం నుంచి మీ సేవ, గ్రంథాలయం తరలింపు ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ను వికాస్‌నగర్ వార్డు కార్యాలయంలోని మీ సేవ కేంద్రానికి .. మీ సేవను న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్‌కు తరలించే యత్నం ఆపాలి’ అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్లకార్డులను పట్టుకుని వికాస్‌నగర్ మీ సేవా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రజల వెన్నంటే ఉంటామని, వారి హక్కుల కోసం పోరాడుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ను అక్కడి నుంచి తరలించి చైతన్యపురి వికాస్నగర్కాలనీలోని మీ సేవ కేంద్రానికి మార్చి, మీ సేవ కేంద్రాన్ని న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్‌కు తరలించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక కాలనీల వాసులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి రెండోరోజూ అడ్డుకున్నారు.
చైతన్యపురి పోలీస్‌స్టేషన్ కోసం టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోనే సుమారు మూడు వేల గజాల స్థలాన్ని కేటాయిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆ అంశాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి.. పోలీస్‌స్టేషన్‌ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ అవసరమే అయితే టిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో పోలీస్‌స్టేషన్‌తో పాటుగా రిజర్వాయర్, సబ్‌స్టేషన్, పార్కు తదితరాల కోసం 2023 మే 5న గత సీఎం కేసీఆర్ తెచ్చిన జీవోను ఎందుకు రద్దు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ‘చైతన్యపురి వికాస్‌నగర్ వార్డు కార్యాలయం భవనంలో మొదటి అంతస్తులో మీసేవా కేంద్రం, రెండో అంతస్తులో గ్రంథాలయం కొనసాగుతోంది. మీ సేవా కేంద్రం నిత్యం రద్దీతో ఉంటున్నది. స్థానిక ప్రజల అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంది.
అదే విధంగా గ్రంథాలయం కూడా స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండగా, వాటిని తరలించేందుకు యత్నించడం ఎంత వరకు సమంజసం’ అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీహాల్లో సీనియర్ సిటీజన్స్ కార్యకలాపాలు సాగుతుండగా వారిని కాదని.. అక్కడికి మీ సేవ కేంద్రాన్ని తరలించాలని చూడటం అన్యాయమన్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, నాయకులు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, తోట మహేశ్‌యాదవ్, కోతి నర్సిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పి. త్రివేది, శివప్రకాశ్,నాగలక్ష్మీ, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు సుష్మిత, రోజా పద్మని, వికాస్‌నగర్ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్, భవానీనగర్ కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, శోభారాణి, విద్యుత్‌నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ద్వారకాపురం కాలనీ సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు ప్రసాద్, పవన్, సంతోష్, తులసీ కృష్ణ, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కోసం నిర్మించిన భవనాలను ప్రజలకే చెందేలా చూడాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. టిమ్స్ ప్రాంగణంలోనే పోలీస్‌స్టేషన్ నిర్మించాలని, ఎంతో మందికి సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని వార్డు కార్యాలయం భవనం నుంచి తరలించవద్దని చెప్పారు. ప్రజల కోసం పోలీస్‌స్టేషన్ అవసరాన్ని గుర్తించే అధికారులు పోలీస్‌స్టేషన్ కోసం కేటాయించిన స్థలంలో పనులు చేసుకుంటే బాగుంటుందన్నారు. వార్డు కార్యాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీసేవ, గ్రంథాలయానికి, న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్‌ను సీనియర్ సిటీజన్స్ కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు.
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి