కంటోన్మెంట్, డిసెంబర్ 30: బోర్డు పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 60 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకు కంటోన్మెంట్ బోర్డు పచ్చజెండా ఊపింది. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో నిర్వహించిన చర్చ అనంతరం బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ నంజుండేశ్వర సారథ్యంలో జరిగిన బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో పాటు, సీఈఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఈఓ పల్లవి విజయ్వన్షీ, బోర్డు సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో రోజుకు అదనంగా 10 లక్షల గ్యాలన్ల చొప్పున నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో వాస్తవాలు వెల్లడించాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీగణేశ్ బోర్డు అధికారులను కోరారు.
కంటోన్మెంట్‌కు గతంలో రోజుకు 5.9 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అయ్యేదని, ప్రస్తుతం 6.9 మిలియన్ గ్యాలన్లు అందుతున్నదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. నీటి బకాయిల చెల్లింపు విషయంలో కొందరు స్థానిక నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి 44, రాష్ట్ర రహదారి 01 మార్గాల్లో చేపట్టనున్న రోడ్డు విస్తరణను ప్రైవేటు స్థలాలు ఉన్న చోట 60 మీటర్లకు బదులుగా, 40 మీటర్లకు కుదించాలని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రస్తావించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 60 మీటర్ల మేరకు విస్తరించడం తప్పనిసరి అని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు తగిన న్యాయం చేస్తుందని, ఈ మేరకు తాను చొరవ చూపుతానని ఎమ్మెల్యే శ్రీగణేశ్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలోనూ అధికారులు ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలన్నారు. తాగునీటి సరఫరా బాధ్యతలను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు.
జనవరి 31 వరకు గడువు పెంచుతూ..
తాగునీటి బకాయిలకు సంబంధించి ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) గడువును జనవరి 31 వరకు పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపింది. టీపీటీ, సర్వీసు చార్జీలపై ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ (టీపీటీ) ఆదాయం గతంలో మాదిరిగా నేరుగా కంటోన్మెంట్‌కు చెల్లించేలా ప్రతిపాదన వస్తే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతీసారి టీపీటీ రాష్ట్ర ఖజానాలోకి వెళ్లడం, తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరుగుతూ ఉండటంతో కొందరు దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. తాను కోర్టుకెళితేనే టీపీటీ బకాయిలు విడుదలవుతాన్నయంటూ చెప్పుకునే నామినేటెడ్ సభ్యుడు, కేంద్రం చెల్లించాల్సిన రూ.900 కోట్లకు పైగా సర్వీసు చార్జీల కోసం ఇదే విధంగా పోరాడాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ కోసం సేకరించే ప్రైవేటు ఆస్తులకు సంబంధించి సమాన విలువ కలిగిన పరిహారం ఇవ్వాలని బోర్డు సభ్యుడు రామకృష్ణ కోరారు. కంటోన్మెంట్లో పదేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తగదని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తక్షణమే బోర్డు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జూబ్లీ బస్‌స్టేషన్ ఆవరణలోని స్థలాన్ని ఐదేండ్ల పాటు పార్కింగ్ కోసం లీజు ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.