బడంగ్ పేట్, మే 15: ప్రపంచంలో ఎక్కడా లేని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలను కేంద్ర బిందువుగా తీసుకొని పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.
ఎవరు అడగకుండానే మహిళల, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులను ప్రోత్సహించడానికి ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఇవ్వడం జరిగిందన్నారు. తల్లీబిడ్డ సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగిందన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి పోయేవరకు ప్రభుత్వ ఖర్చుల ద్వారానే పంపడం జరిగిందన్నారు. అలాంటి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. కెసిఆర్ కిట్టును వెంటనే పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.
హమీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం..
ఆడబిడ్డలు బిందెలు తీసుకొని రోడ్లపైకి రాకుండా ఉండటానికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చామన్నారు. రైతుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామని.. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు రాలేదన్న ఒక్కరైతును చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు బందై పోయిందన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసి 500 రోజులవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని సబితారెడ్డి నిలదీశారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు.
సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడవచ్చా..
రాష్ట్ర పరిస్థితి బాగాలేదని, అప్పులు ఎవరూ ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. దొంగలుగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లు వస్తున్నారని, ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వటంలేదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొరుక్కొని తినండి, కాల్చుకొని తినండి అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పడం దేనికి నిదర్శనం అన్నారు. వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, పీఓపీఆర్డీ రవీందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, వైస్ చైర్మన్ యాదయ్య తదితరులు ఉన్నారు.