ఆర్కేపురం, జూన్ 20 : రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం, సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకపోవడం, రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం, రైతు భీమా ప్రీమియం చెల్లింపుల్లో నిర్లక్ష్యం చూపడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రైతులను రాజుగా నిలబెట్టే విధానాలు అమలు చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల పరిస్థితిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరా, రైతు భరోసా తదితర అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.