బడంగ్‌పేట, జూలై14: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం అల్మాస్గూడ తిరుమల్ నగర్ కాలనీలో పర్యటించి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగల సమస్యలను పరిష్కరించకుండా తప్పించుకోవడానికి కోచింగ్ సెంటర్ల మీద, నిరుద్యోగుల మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 11వేల పోస్టులు వేసిందన్నారు. అప్పుడు మెగా డీఎస్సీ ద్వారా 25 వేల పోస్టులు వేస్తామని ఎందుకు హామీ ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. టెట్ పరీక్ష రాసిన తర్వాత 45 రోజులు సమయం ఇవ్వాలని కోరుతుండగా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పరీక్షలు రాయని వారే ధర్నా లు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మెగా డీఎస్సీ ఏమైందన్నారు. 2014 కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల పై నిర్బంధ కాండ ప్రయోగిస్తున్నారన్నారు. సీపీఐ నాయకులను సైతం అరెస్టు చేస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎవరిని వదిలిపెడుతారన్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 250 కోట్లు నిధులు రద్దు చేశారన్నారు.