బడంగ్‌పేట, నవంబర్ 30: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ.69 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను నిలిపి వేశారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మంత్రి శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా మధ్యంతరంగా ఆగిపోయిన పనుల వివరాలను వివరిస్తూ.. వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన నిధులు రద్దు చేయడం వల్ల మధ్యంతరంగా పనులు ఆగిపోయాయని ఆమె తెలిపారు. పెండింగ్ పనులను పూర్తి చేసే విధంగా నిధులు మంజూరు చేయించాలన్నారు.
చాలా చోట్ల బస్తీ దవాఖానలు, సమీకృత మార్కెట్ల పనులు నిలిపివేశారని తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేసిందని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెండింగ్ పనులను పూర్తి చేసే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కమిషనర్ సరస్వతి, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, బండారు మనోహర్, ఎర్ర మహేశ్వరి జైయిం తదితరులు పాల్గొన్నారు.