MLA Prakash Goud | మైలార్‌దేవ్‌పల్లి : రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ మైలార్‌దేవ్‌పల్లి నుంచి దుర్గానగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం, ఆరాంఘర్ వద్ద రెండు ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో రూ.259 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని.. కానీ, నిధులు విడుదల కాలేదన్నారు.
వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులుపడుతున్నారని.. సమస్య రోజు రోజుకు జఠిలంగా మారుతుందన్నారు. కొద్ది దూరం ప్రయాణానికే అరగంట సమయం పడుతుందని పడుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే నిధులను విడుదల చేయడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు వివరించారు.