సికింద్రాబాద్, ఏప్రిల్ 18 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపు నిచ్చారు. పద్మారావు అధ్వర్యంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం గురువారం సీతాఫల్ మండిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ పండుగను ఈ నెల 27 వ తేదీన ఘనంగా జరుపుకుందామని అన్నారు.
ఈ నెల 27 వ తేదీన ఉదయం 10.00 గంటలకు అన్ని డివిజన్ లలో తోరణాలు, జెండాలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి గులాబీ జెండాలను ఆవిష్కరించాలని కోరారు. 10 లక్షల మందితో సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోందని, సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీగా కార్యకర్తలు, జనం తరలి వెళ్లాలని తను కూడా జనం వెంటే ఉంటానని తెలిపారు.
16 నెలల పాలనతోనే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు శైలజ, ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, హేమ, సునీత , నేతలు ఆలకుంట హరి, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, కంది నారాయణ, గుర్రం పవన్ కుమార్ గౌడ్, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.