కవాడిగూడ, ఫిబ్రవరి 24: ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ (Muta Gopal) అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోటలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ హాల్ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్నికోటలో దాదాపు 5 వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. ఏ చిన్న శుభకార్యం జరుపుకోవాలన్న బయటకు వెళ్లాల్సి వస్తుందని, ఫంక్షన్ హాళ్లలో చేసుకోవాలంటే రెక్కాడితే కాని డొక్కాడని తమలాంటి వారికి భారమవుతుందని, తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉంటున్న ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఉన్నకోట వాసులు శుభకార్యాలు జరుపుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పారు.
జీ ప్లస్ వన్‌గా నిర్మాణం చేపడుతున్న కమ్యూనిటీ హాల్ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించి ఆరు నెలల్లో పూర్తిచేసి బస్తీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా బస్తీ వాసులందరూ కమ్యూనిటీ హాల్‌ను కాపాడుకోవాలని, శుభకార్యాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యాంయాదవ్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, చిత్రాలనగర్ శ్రీహరి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, మాధవి, రూప, మంజుల, శ్రీనివాస్ గుప్తా, వల్లాల రవియాదవ్, రాజు యాదవ్, రాజేష్, నర్సింగ్, సురేష్, శివ, వెంకటేష్ తదితర ఉన్నికోట వాసులు పాల్గొన్నారు.