మల్కాజిగిరి, జూలై 19 : ఆధునిక డ్రైనేజీ నిర్మాణాలు(Modern drainage )ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri )అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ ఆశోక్ రెడ్డిని కలసి నియోజక వర్గంలో ఆధునిక డ్రైనేజీ, మంచి నీటి పైపులైన్లు, రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రతిపాదనలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువలు శిథిలావస్థకు చేరడంతో పాటు మురుగు నీటి పారుదలకు సరిపడా సామర్ధ్యం లేదని అన్నారు. జనసాంద్రత పెరగడంతో కొత్తగా కాలనీలు వెలుస్తున్నాయని, వారికి డ్రైనేజీతో పాటు నీటి కోసం కొత్తగా పైపులైన్లు వేయాలని అన్నారు.
కొత్తగా కడుతున్న భవనాలకు మురుగు నీరు పారుదలకు సౌకర్యం లేకున్నా భవనాలకు అనుమతులు ఇవ్వడంతో మురుగు నీరు రోడ్లపైన పారుతుందని అన్నారు. కొత్తగా భవనాలకు అనుమతులు ఇవ్వకముందు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు వాటర్ వర్క్స్ శాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఈస్ట్ ఆనంద్బాడ్ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థతో పాటు వరద నీరుపారడానికి సరమైన సౌకర్యం లేక పోవడంతో తరచూ కాలనీలు ముంపునకు గురిఅవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయాదవ్, అనిల్‌కిశోర్, రమేష్, అమీనుద్దిన్, ఢిల్లీ పరమేష్, శరణగిరి, వెంకటేష్ యాదవ్, సందీప్ రెడ్డి, సతీష్, హనుమాన్చారి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.