మల్కాజిగిరి : నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Mla Marri Rajashekar Reddy) కోరారు. బుధవారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో జాప్యం చేయవద్దని అన్నారు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అధికారులు ఇతర శాఖలతో సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సర్కిల్ పరిధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడతామని, అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులతో సహకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి త్వరలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణపనులను ప్రారంభిస్తామని అన్నారు.
అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పెండింగ్ పనులను గుర్తించి, పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు కొత్తపల్లి మీనాఉపేందర్ రెడ్డి, మేకట సునీతరాము యాదవ్, శ్రవణ్‌కుమార్, క్యానం రాజ్యలక్ష్మి, గున్నాల సునీత, నాయకులు అమీనుద్దిన్, ఖలీల్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.