ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపంలో ఉన్న ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్వాశత పరిష్కారం లభించనుంది. ఏవోసీ గేట్ల వద్ద ఏర్పడుతున్న సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు జీహెచ్ంఎసీ, ఆర్మీ అధికారులను పల్లుమార్లు కలిసి విన్నవించాను.
దీనికి స్పందించిన ఆర్మీ, జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏవోసీ గేట్ల వద్ద ప్రత్యామ్నాయ రహదారులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన క్రమంలో రూ. 960 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే రైల్వే చక్రబంధం నుంచి విముక్తి లభించనుంది.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజిగిరి
మేడ్చల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి నియోజకవర్గం ఏవోసీ చుట్టూ ఉండే ప్రజలు ఆర్మీ అధికారుల ఆంక్షల కారణంగా గేటు మూసివేసిన సమయంలో గమ్యానికి చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఏళ్ల తరబడి కొనసాగిన ఈ సమస్య వలన నియోజకవర్గానికి చెందిన దాదాపు నాలుగు లక్షల మందికి పైగా వాహనదారులు అదనంగా ఐదారు కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. అయితే తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చడానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. మర్రి అకుంఠిత దీక్ష, కృషి ఫలితంగా మల్కాజిగిరి ప్రజలకు, వాహనదారులకు ఆర్మీ ఆంక్షల నుంచి విముక్తి లభించనుంది. ఎన్వోసీ పరిసర ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఈ విషయమై ప్రభుత్వంపై నిరంతరం సంప్రదింపులు జురపడంతో పాటు ఒత్తిడి తెచ్చి.. రైల్వే ట్రాక్‌ను అనుసరించి నూతన రహదారుల ఏర్పాటుకు బాటలు వేశారు. దాదాపు రూ.960 కోట్లతో చేపట్టే ప్రత్యామ్నాయ రహదారులకు సంబంధించి ప్రభుత్వ త్వరలో టెండర్లు పిలవనుంది.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఆర్కేపురం, సైనిక్‌పురి, ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ తదితర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలన్నా ప్రయాణం అంత సులువు కాదు. వీరంతా ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్, ఏవోసీ రహదారుల నుంచే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తరచూ ఈస్ట్ మారేడ్‌పల్లి ఎన్వోసి గేటును ఆర్మీ అధికారులు మూసి వేస్తుంటారు. ఆర్మీ అప్రమత్తత.. పైగా రక్షణ వ్యవస్థ అయినందున ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. అయితే ఈ ఆంక్షలను తొలగించేందుకు గతంలో ప్రజలు అనేకరకాల ప్రయత్నాలు చేసినా కేంద్ర రక్షణ వ్యవస్థ కూడా జాగ్రత్తల కారణంగా పరిష్కారాన్ని చూపలేకపోయింది.
ప్రస్తుతం ఏవోసీ గేట్ చుట్టు పక్కల నివాసం ఉండే వాహనదారులు నగరంలోకి రావాలంటే కచ్చితంగా ఏవోసీ రహదారుల మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యే మర్రి కృషితో వీటికి ప్రత్యామ్నాయంగా వంద ఫీట్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మహేంద్ర హిల్స్ నుంచి ఉత్తమ్‌నగర్, సఫిల్‌గూడ మీదుగా నేరేడ్‌మెంట్, ఆర్కేపురం బ్రిడ్జి వరకు వంద ఫీట్ల రహదారులను
తీసుకువస్తారు. ఈ వ్యవస్థ అంతా రైల్వే ట్రాక్‌కు అనుగుణంగా సాగుతుంది. దాదాపు ఎనిమిది కిలోమీటర్లకు పైగా నిర్మించనున్న ఈ రోడ్ల ద్వారా తరచూ ఆంక్షలు ఉండే ఏవోసీ రహదారుల మీదుగా కాకుండా నేరుగా వీటి ద్వారా రాకపోకలు సాగించవచ్చు. ఇందుకు రూ.960 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా రూపొందించగా ప్రభుత్వం మంజూరు ఇచ్చింది.
అయితే ఈ రహదారులు నిర్మాణంతో రక్షణశాఖకు చెందిన 42 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకుగాను రక్షణ శాఖకే రూ.442 కోట్ల వరకు చెల్లించాలి. ఆ నిధుల్ని జీహెచ్ఎంసీ నష్ట పరిహారం కింద ఇవ్వనుంది. ఇక్కడ రక్షణ శాఖ కోల్పోతున్న భూముల ధరలకు సమానంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్, శామీర్‌పేట్, జవహర్‌నగర్ తదితర మండలాల పరిధిలో సుమారు వంద ఎకరాల భూమిని రక్షణ శాఖకు ఇవ్వనున్నారు. జీహెచ్ంఎసీ, రక్షణ శాఖ, రెవెన్యూ అధికారులను సమన్వయం చేసి రహదారుల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న చర్యలు ఫలించాయి. ఆయా పనులకు సంబంధించి ఈనెల 2న అధికారులు టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఏవోసీకి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో ఓటర్లు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. తదనంతరం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా లక్ష్యాన్ని చేరుకున్నారు. అందులో భాగంగా ఆర్కేపురం బ్రిడ్జి నుంచి రైల్వే లైన్‌కు అనుగుణంగా సఫిల్‌గూడ, ఐఎన్ నగర్ మీదుగా ఏవోసీ రహదారులను కలవకుండా కొత్త రహదారులతో అనుసంధానం చేసేందుకు నిధులు సాధించారు. తద్వారా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సైతం ఈ కొత్త రహదారి వ్యవస్థతో ప్రయాణం సౌకర్యవంతంగా మారనుంది.