మల్కాజిగిరి: ఆర్యూబీల నిర్మాణ పనులను ప్రాంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జనరల్ మేనేజర్ అరుణ్ జైన్‌ను కలిసి ఆర్యూబీల నిర్మాణ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులను మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వాజ్పేయినగర్, గౌతంనగర్ ఆర్యూబీల నిర్మాణాల కోసం అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు.
ఇప్పటికే అనుమతులు వచ్చిన వాజ్పేయినగర్, గౌతంనగర్ రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్యూబీల నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరినట్లు వెల్లడించారు. నేరేడ్మెట్ వద్ద రామకృష్ణాపురం ఫ్లై ఓవర్ బ్రడ్జి వద్ద అదనంగా రెండు లైన్ల రోడ్డును నిర్మించాలని, తుర్కపల్లి వద్ద ఆర్యూబీ నిర్మాణం కోసం అన్ని అనుమతులు వచ్చాయన్నారు. బొల్లారం బజార్ కొత్త బస్తీ వద్ద రైల్వే స్థలంలోని నాలా సమస్యను టన్నెల్‌ను విస్తరించి పరిష్కరించాలన్నారు.
మిర్జాలగౌడ్ శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం, మల్కాజిగిరిలోని రైల్వే క్వాటర్స్ వద్ద దుర్గామాత దేవాలయాల స్థలాలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. వినాయక్‌నగర్ డివిజన్ కేశవనగర్‌లోని రైల్వే స్థలంలో పేద మహిళలు కుట్టు మిషన్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని, అక్కడ రైల్వే అధికారులు ఖాళీ చేయాలని బోర్డు పెట్టారన్నారు. వినతిపై రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ జైన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, రమేశ్, అనిల్‌కిశోర్, జీకే హన్మంతరావు, చిన్నయాదవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా అని అసెంబ్లీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఈనెల 18న లేవనెత్తిన అంశానికి ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలో విదేశీ విద్యార్థుల ఫీజుల బడ్జెట్‌పై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ను వైస్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్రాహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయడంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే వివిధ దేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో ఫీజులు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల బడ్జెట్ కేటాయించినా ఇప్పటికీ రూ.30 కోట్లు మాత్రమే విడుదల చేశారని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నుంచి ఆర్థిక సహాయం(స్కాలర్ షిప్) అందుతుదన్న నమ్మకంతో విదేశాలకు వెళ్లి గోస పడుతున్నారన్నారు.
చాలా మంది అర్చక వృత్తిని ఉపాధిగా చేసుకున్న పేద బ్రాహ్మణుల పిల్లలు ప్రభుత్వ స్కాలర్షిప్లను నమ్ముకొని విదేశాలకు వెళ్లి అక్కడ సరైన ఉద్యోగాలు దొరక్క తిరిగి స్వదేశానికి రాలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లను విడుదల చేసి విద్యార్థులను ప్రభుత్వం అందుకోవాలని అసెంబ్లీలో స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించి.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు వైస్ చైర్ పర్సన్‌ను నియమించడం హర్షణీయమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.