‘నియోజకవర్గ అభివృద్ధికి పోరాడి నిధులు తీసుకురావాల్సి వస్తున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదు.. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు.. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరుకు ఇప్పటి వరకు వేల సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించినా సర్కారు స్పందించడం లేదు’ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడుతానని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ):
సెలవు లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక రకాల సేవలు అందిస్తున్నా. నియోజకవర్గంలో ప్రధానంగా అదనంగా గౌతంనగర్ రిజర్వాయర్, మల్కాజిగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణాలు త్వరలోనే చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నా. మల్కాజిగిరి అదనంగా యూపీఎస్సీ దవాఖానను మంజూరు చేయించా. ప్రజల కోసం రెండు లైబర్రీలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నా.
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వంతో పోరాడి నిధులు తెవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదు. నిధుల మంజూరులో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టిసారించకపోవడంతో సమస్యలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యే వరకు నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధమయ్యా.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు వేల సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించా. నియోజకవర్గంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు రూ. 250 కోట్ల నిధుల ప్రతిపాదనలతో సీఎస్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, జోనల్ కమిషనర్లను స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించినా.. ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయడం లేదు. ఇప్పటి వరకు నిధులు మంజూరుకు అనేక సార్లు అధికారులను కలిసినా.. నిరక్ష్యం వహిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి పోరాడేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంతో పోరాడి రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేయించా. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో డ్రైనేజీలు, వాటర్ పైపులైన్లు, కమ్యూనిటీహాళ్లు, పార్క్‌ల అభివృద్ధి, రోడ్లు నిర్మించాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. ఎమ్మెల్యే పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలకు కావాలనే దూరంగా ఉంటున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన చేస్తుంటే అధికారులు రాకుండా తప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను అధికారులు ఏ మాత్రం గౌరవించడం లేదు. ముఖ్యంగా అల్వాల్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి అల్వాల్ సర్కిల్ అభివృద్ధికి సహకరించడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానాలు దాటవేయడం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్‌ను పాటించకపోవడాన్ని ఇక నుంచి సీరియస్‌గా తీసుకుంటా. ప్రజల సమస్యల పరిష్కరానికి అధికారులందరూ స్పందించాల్సిందే.. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నియోజకవర్గంలో ప్రస్తుతం 12 ఆర్యూబీ, ఆర్వోబీ నిర్మాణాలు చేయాల్సింది ఉంది. ఇందులో ప్రజల ఆస్తులు నష్టపోకుండా ఉండేలా రీ డిజైనింగ్ చేసి ఆర్యూబీ నిర్మాణాలు చేసేలా రైల్వే అధికారులను ఒప్పించా. ఇందులో వాజ్పేయినగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో రీ డిజైనింగ్ చేయక ముందు 60 నుంచి 70 ఇంటి యజమానులకు ఆస్తినష్టం జరిగే విధంగా ఉండగా, రీ డిజైనింగ్ తర్వాత 9 ఇండ్లకు మాత్రమే నష్టం జరుగుతున్నది. ఇలానే అన్నింటినీ రీ డిజైనింగ్ చేయించి.. ప్రజల ఆస్తులు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నా. 12 రైల్వే వంతెనల్లో భాగంగా 4 బ్రిడ్జిల నిర్మాణాలకు రైల్వేశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది.
నియోజకవర్గ అభివృద్ధి చేయాలన్నాదే నా ధ్యేయం. . నియోజకవర్గ ప్రజలందరికీ నా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
నియోజకవర్గ ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా. అరుంధతి వైద్యశాలలో 24 గంటల పాటు ఉచితంగా వైద్యసేవలతో పాటు ఆసుపత్రికి వచ్చేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాం. వైద్య సేవల్లో భాగంగా జర్వం నుంచి క్యాన్సర్ వరకు ఉచిత వైద్యం… గుండె సంబంధిత వ్యాధులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. నియోజకవర్గం నుంచి ప్రతి రోజూ 5 వందల నుంచి వెయ్యి పైచిలుకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం.
నియోజకవర్గ ప్రజల ఆస్తుల రక్షణకు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు నా సొంత నిధులను వెచ్చిస్తున్నా. మల్కాజిగిరి నియోజకవర్గంలోని జేఎల్‌ఎస్‌నగర్‌లో 30 ఏండ్లుగా నివాసముంటున్న వంద పైచిలుకు కుటుంబాలకు ఇది ఎండోమెంట్ భూమి అంటూ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. వారికి ఆస్తులపై అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై బాధితులు నా వద్దకు రాగా, వారి తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు అండగా నిలిచా.
అలాగే తారకరామనగర్‌లో నివాసముండే 50 మంది కుటుంబాలకు రైల్వేశాఖ తమకు చెందిన భూమి అంటూ నోటీసులు ఇస్తే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి నా సొంత ఖర్చులను వెచ్చించి బాధితుల తరఫున పోరాడుతున్నా. మౌలాలి, ఈస్ట్ఆనంద్బాగ్, మల్కాజిగిరి, వినాయక్‌నగర్ డివిజన్లలో ఉన్న వందలాది సర్వే నంబర్లలో ఉన్న 19,637 నివాసాలను వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలంలో ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లలో నిషేధిత జాబితాలో చేర్చిన విషయమై వక్ఫ్ బోర్డు కమిషనర్‌తో చర్చించి వారికి న్యాయం చేయాలని కోరా. అనేక సంవత్సరాలుగా ఇంటి నిర్మాణాలు చేసుకుని ఇంటి పన్నులు చెల్లిస్తున్నా నిషేధిత జాబితాలో చేర్చారు. నిషేధిత జాబితా నుంచి తొలగించేలా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.