మల్కాజిగిరి: భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం ప్రభుత్వ వైఫల్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని 382 ఎకరాలు, 100 సర్వే నంబర్లు, 70 కాలనీల్లోని భూముల లావాదేవిలను వక్ఫ్ బోర్డు సీఈవో ఇటీవల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాదాపు 30 ఏండ్ల కిందట ఇక్కడ ఇండ్లు కట్టుకొని పేదలు నివసిస్తున్నారన్నారు.
దాదాపు 1,967 కుటుంబాల్లో లక్ష మంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇండ్ల కొనుగోలు, అమ్మకాలు నిషేధించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు నిషేధించిన జాబితా నుంచి పేదల ఇండ్లను తొలగించాలని సీఎంను కోరానని చెప్పారు. గౌతంనగర్ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి 5 ఎంఎల్ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలోని చెరువుల పరిరక్షణతో పాటు సుందరీకరణకు చేయాలని సీఎంకు వినతిపత్రం అందజేశానని తెలిపారు.
అందని ద్రాక్షగా విదేశీ విద్య
పేద విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగా మారిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో విదేశీ విద్యార్థుల ఫీజుల బడ్జెట్‌పై ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్రహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయడంలో జాప్యం జరుగుతుండడంతో వివిధ దేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో ఫీజులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. ఇప్పటికీ రూ.30 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఎమ్మెల్యే వివరించారు.