సిటీబ్యూరో: గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్కు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టారని, వారికి వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో లావాదేవీలో పాయింట్ 5 లేక పాయింట్ 25 శాతం వారికి లభించేలా చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫార్మాసిటీని ముచ్చెర్లలోనే ఏర్పాటు చేయాలని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కు చేయుతనివ్వాలని కోరారు.
గత ఏడాది పరిశ్రమలకు రూ. 1400కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తే, ఈసారి కేవలం రూ. 500కోట్లు మాత్ర మే బడ్జెట్లో పెట్టారని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందని, గతంలో మంత్రిగా కేటీఆర్ ప్రవేశపెట్టిన లుక్ ఈస్ట్ పాలసీని అమలు చేయాలని, ఇందులో భాగంగా నగర తూర్పు ప్రాం తంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నా రు. జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తన తల్లికి మోకాలి ఆపరేషన్ అయినందున ఆమె కోసం వీల్‌చైర్ ఏర్పాటు చేయాలని తాను ముందస్తు సమాచారం ఇచ్చినా ఎయిర్‌పోర్టు సిబ్బంది పట్టించుకోలేదని, సెక్యూరిటీ క్లియరెన్స్ అయ్యాక చెప్పండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆయన సభ దృష్టికి తెచ్చారు.
జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో 13 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నప్పటికీ ఇక్కడి ఎమ్మెల్యేల పట్ల వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. కంకర మిషన్లు రావడం వల్ల వడ్డెర కమ్యూనిటీ తమ ఉపాధిని కోల్పోయిందని, వారిని డీఎంఎఫ్ ఫండ్ నుంచి ఆదుకోవాలన్నారు. అలాగే, కుమ్మర కమ్యూనిటీని ఆదుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో మట్టి పాత్రలను, మట్టి కప్పులను ప్రోత్సహించాలని సూచించారు.