మంత్రి పదవి కోసం మల్రెడ్డి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశం తెరపైకి వచ్చిందే తడవుగా చలో హస్తిన అంటూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం రంగారెడ్డికి పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మంత్రివర్గంపై ఢిల్లీ అధిష్ఠానం కసరత్తు మొదలుపెట్టిందనే వార్త రాగానే మల్రెడ్డి ‘మళ్లీ హస్తినకు పోయి రావలె’ అన్నారు. గత ఐదారు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన చివరకు తనకు మద్దతుగా కొందరు కీలక నియోజకవర్గ నాయకుల్ని కూడా అక్కడికి పిలిపించుకున్నారు. ఎలాగైనా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవకాశాలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ.. గానే ఉన్నాయని సీనియర్ నేతలే చెబుతుండటంతో జాబితా విడుదల తర్వాత నియోజకవర్గ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుందనే చర్చ ఊపందుకుంది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప.. అన్నట్లుగా తయారైంది. పార్టీలో సీనియర్ అయిన తనకు ఆదిలోనే మంత్రివర్గంలో అవకాశం దొరుకుతుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఆది నుంచి బెర్త్ ఖరారు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాధాన్యమైతే లేదు. కానీ శాసనసభ స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్ ఉన్నారు. పైగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు.
ఉప ఎన్నికలో కంటోన్మెంట్ నుంచి శ్రీగణేశ్ గెలిచినప్పటికీ ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రంగారెడ్డి జిల్లా సానుకూలతతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న నియోజకవర్గం కావడం, అంతకుమించి సీనియర్ నేత కావడం.. ఇవన్నీ వాస్తవానికి తనకు కలిసిరావాల్సి అంశాలే అనే భావన ఆయనలో ఉంది. కానీ సామాజిక సమీకరణాల్లో.. మరో కారణమో.. ఎక్కడో తేడా కొడుతుందనే అనుమానం కూడా బాగానే ఉంది. దీంతో ఆది నుంచి మంత్రివర్గంలో బెర్త్ కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు.
ఔర్ ఏక్ ధక్కా..!
మంత్రివర్గంలో స్థానం కోసం మల్రెడ్డి మరోసారి యుద్ధమే మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎక్కే గడప.. దిగే గడప.. అన్నట్లుగా ఆయన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అనే సంకేతాలు వెలువడుతుండటంతో చివరి ప్రయత్నమే మరింత ‘గట్టి’గానే చేయాలనుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ మల్రెడ్డి మాత్రం అక్కడే ఉండి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… రెండో రోజుల కిందట నియోజకవర్గంలోని కీలక నేతలు పలువుర్ని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కూడా ఆయన ఆదేశించడంపై నియోజకవర్గంలో తీవ్రచర్చ జరుగుతున్నది. అయితే ఢిల్లీకి వెళ్లిన నాయకులకు ఇప్పటివరకైతే మల్రెడ్డి కలవకున్నా..మీరైతే ఇక్కడే ఉండండి అని మాత్రం ఫోన్లో సూచించినట్లు తెలిసింది. దీంతోఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకే ఆయన అనుచరులను పిలిపించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒక్కో అస్ర్తాన్ని పరీక్షించినా..!
ముఖ్యంగా గతంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నపుడు కాస్త ‘గట్టి’గానే ప్రయత్నాలు చేశారు. ఆమె నుంచి భరోసా రావడంతో ఇక బుగ్గకారులో తిరగడమే తరువాయి అనుకున్నారు. కానీ ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఇదే క్రమంలో దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో మల్రెడ్డి పరిస్థితి కాస్త గందరగోళంగానే మారింది. దీంతో ఆయన సన్నిహితులతో పాటు రాష్ట్ర పార్టీ పెద్దలకు సైతం తాను గతంలో చేసిన ‘గట్టి’ ప్రయత్నాల తీరును ఏకరువు పెట్టుకొని వాపోయినట్లు సమాచారం.
అనంతరం తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసి చివరకు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలహారిస్ దాకా తన పైరవీలను విస్తరించడం ఆ సందర్భంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ అటు అధిష్ఠానం… ఇటు రాష్ట్ర పెద్దల నుంచి ఎలాంటి భరోసా లభించలేదు. ఇక లాభం లేదనుకుని… కొంతకాలం కిందట బహిరంగంగానే రాజీనామా అస్ర్తాన్ని సైతం ప్రయోగించారు. తన సామాజిక వర్గమే తనకు అడ్డుగా ఉంటే.. తాను రాజీనామా చేసి నియోజకవర్గం నుంచి బీసీ నేతను గెలిపించుకుంటానని కూడా వ్యాఖ్యానించి మంత్రి పదవిపై తనకున్న బలమైన ఆకాంక్షను వెల్లడించారు.
ఇంతచేసినా.. ఎటు నుంచి కూడా ఆయనకు భరోసా దొరకడంలేదని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇక.. పొరుగు నల్లగొండ జిల్లా రాజకీయాల్ని సైతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మల్రెడ్డి తెర వెనక పావులు కదిపారనే వ్యాఖ్యలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సీనియర్ నేత జానారెడ్డి ఏకంగా పార్టీ అధిష్ఠానానికి రాసిన లేఖ కూడా సంచలనమైంది. రాష్ట్రంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించాలని జానారెడ్డి తన లేఖలో అధిష్ఠానానికి సూచించడం మల్రెడ్డి ఆశలకు రెక్కలు తొడిగినట్లయింది.