జవహర్‌నగర్, జనవరి 22 : యువతకు అందుబాటులో క్రీడా మైదానం ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టేడియాన్ని నిర్మించాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కబ్జాకు గురవుతున్నదని ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy)అన్నారు. కబ్జాచేసే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జవహర్‌నగర్ క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో సర్వే నెం.704, 706లో అక్రమంగా కొందరు కబ్జాదారులు నిర్మాణాలు చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మేయర్ మేకల కావ్య, ఉద్యమకారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యలో జవహర్‌నగర్ యువకులు బుధవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. క్రీడా మైదానాన్ని గతంలోనే చదును చేయించి యువత ఆటలు ఆడుకునేలా చేశామన్నారు. అక్రమార్కుల కన్ను క్రీడా మైదానంపై పడింది. ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేనే దగ్గరుండి ఫెన్సింగ్ వేసి యువతకు శాశ్వతంగా మైదానం ఉండేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కబ్జాకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కారు భూములపై అక్రమార్కులు నజర్ వేస్తే ఊరుకోబమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ యువకులు నరేందర్ యాదవ్, కార్తీక్‌రెడ్డి, విక్రమ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.