బంజారాహిల్స్,ఆగస్టు 31: నియోజకవర్గంలో తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జలమండలి అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులతో పాటు మురుగు సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు నిధులు మం జూరు చేయించామన్నారు. బోరబండ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నాలుగురోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు. మల్లారం పంప్ హౌజ్లో వరదనీరు రావడంతో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించి వెంటనే నీటి సరఫరా చేస్తామని జలమండలి అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి డివిజన్-6 జీఎం హరిశంకర్, డీజీఎం దిలీప్కుమార్తో పాటు ఎర్రగడ్డ,ఎస్పీఆర్ హిల్స్, జూబ్లీహిల్స్, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ వాటర్ వర్క్స్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.