బంజారాహిల్స్, ఆగస్టు 27 : సమాజంలో అత్యంత పేదరికంతో మగ్గుతున్న వర్గాలకు చేయూతనిచ్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తే ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. శుక్రవారం యూసుఫ్‌గూడ, షేక్‌పేట డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు చేయూతనిచ్చేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు విజయవంతంగా అమలు పరుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పించన్లు, రైతు బంధు తదితర పథకాలతో పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏ పథకం ప్రారంభించినా రచ్చ చేయడం వారికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, షేక్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్, పూస వేణు, గోపాల్‌రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.