కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 29 : ఆకాశ ంలో సర్వేలు.. అధికారులిచ్చిన తప్పుడు నివేదికలతో కూకట్‌పల్లిలోని చెరువుల ఆక్రమణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. నియోజకవర్గంలోని 9 చెరువుల ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జి కమిటీతో సర్వే చేయించి నిజనిర్ధారణ చేయించాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి నిర్ణయించి.. ఎవరి హయాంలో కబ్జాలు జరిగాయో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి చెరువులలో కబ్జాలు జరిగాయని అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
సమాచార హకు చట్టం ద్వారా చెరువులపై తీసుకున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. గత పదేండ్లలో కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులలో ఎలాంటి కబ్జాలు జరగలేదని స్పష్టంగా తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌పై అవగాహన లేని మంత్రి… తప్పుడు సమాచారంతో చెరువులు కబ్జా జరిగాయని మాట్లాడటం బాధాకరమన్నారు. ఆకాశం నుంచి సర్వేలు చేయడం కాదని, భూమిపై సర్వేలు చేసి నిజనిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. నల్ల చెరువు, సున్నం చెరువులలో బఫర్‌జోన్ పరిధిలో.. కోర్టులో కేసులు ఉన్న స్థలాల్లో నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చివేశారన్నారు. హైడ్రా పేరుతో చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు నిద్ర లేకుండా చేశారన్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని, వారికి అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. చెరువుల ఆక్రమణలపై ఎవరైనా తనపై తప్పడు ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.