బాలానగర్, జూన్ 30 : 60 ఏళ్లలో కాని అభివృద్ధి 9 ఏళ్ళలో చేశామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి రూ.3.33 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పలు వ్యవస్థలు (డ్రైనేజీ, తాగునీరు, రహదారి) అస్తవ్యస్తంగా తయారయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నేడు భూగర్భ డ్రైనేజీ వ్యస్థలో సమూల మార్పులు చేసి నగర ప్రజలకు మెరుగైన వ్యవస్థను నిర్మించినట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీలేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను సమస్యల రహిత డివిజన్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్‌రావు, ఇర్ఫాన్, హరినాథ్, గడ్డం నర్సింగ్, మట్టి శ్రీను నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.