బాలానగర్, ఆగస్టు 16 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మెరుగైన అభివృద్ధి జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ ఆర్ఆర్నగర్ నుంచి శంకర్ ఎన్క్లేవ్ వరకు రూ.1.24కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీ పనులకు డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్పింహాయాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ ఎన్‌క్లేవ్‌లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శంకర్ ఎన్‌క్లేవ్‌లో భూగర్భ డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు రూ.15లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు.. పోయారు.. అభివృద్ధిని మరిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడూలేని అభివృద్ధి జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టి నీటిపారుదల రంగాన్ని మెరుగుపరిచినట్లు తెలిపారు. నగరంలోని చెరువులు, నాలాల్లో మురుగునీటిని శుద్ధి చేయడం కోసం ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలో రూ.415కోట్ల నిధులతో ఎస్టీపీల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
హస్మత్‌పేట చెరువు సుందరీకరణ పనులు కూడా చేపట్టినట్లు సూచించారు. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కూకట్పల్లి, బాలానగర్‌లలో వెయ్యికోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణపనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు, అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ హాల్స్, అన్ని సామాజిక వర్గాల వారి గ్రేవ్యార్డ్ల అభివృద్ధికి సైతం తనవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నిబద్ధతతో పని చేసే వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం సంతోషదాయకం అన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్‌గౌడ్, సికింద్రాబాద్ డివిజన్ రైల్వేబోర్డు సభ్యుడు కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్ కర్రె లావణ్య, సీనియర్ నాయకులు బల్వంత్‌రెడ్డి, ఇర్ఫాన్, హరినాథ్, బాలరాజు, సరోజ, ఖదీర్‌తో పాటు శంకర్ ఎన్క్లేవ్ కాలనీవాసులు పాల్గొన్నారు.