దుండిగల్, ఏప్రిల్ 28 : నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి పురపాలక సంఘాల పరిధిలో కరోనా పరీక్ష కేంద్రాలతో పాటు వ్యాక్సిన్ కేంద్రాలను (కొవిడ్ సెంటర్లు) ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. నియోజకవర్గంలోని షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం కాలనీ పట్టణ ఆరోగ్యకేంద్రంతో పాటు బస్తీ దవాఖానలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ విధానాన్ని పరిశీలించి, పరీక్షలు, వ్యాక్సిన్ వేసుకునేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. వైద్యసిబ్బంది అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.ఆనంద్, మండల వైద్యాధికారి నిర్మల, వైద్యులు నవనీత, మమత, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు సురేశ్‌రెడ్డి, విజయరాంరెడ్డి, ఇంద్రసేనాగుప్తా తదితరులు పాల్గొన్నారు.