కాచిగూడ, ఏప్రిల్ 27 : పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణ యుగంగా సాగిందని, రైతుబంధు, రైతు భీమా, 24 గంటల కరెంటు, సాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణం, ఐటీ కంపెనీలు లాంటి ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ వైపు యావత్ దేశం ఎదురు చూస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మదేవ్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ లోని లింగంపల్లి చౌరస్తాలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఎత్తిన నినాదాన్ని నిజం చేసి చూపిన అహింస ఉద్యమ నాయకుడు కేసీఆర్ అన్నారు. గులాబీ జెండాను ప్రతి గుండెకు దగ్గర చేసిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ బిడ్లాన్, డాక్టర్ శిరీష యాదవ్, రవీందర్ యాదవ్, నాగేందర్ బాబ్జి, బి.కృష్ణ గౌడ్, ఎల్.రమేష్, మహేష్ కుమార్, సరిత, శ్రీకాంత్ యాదవ్ పట్లూరి సతీష్ తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.