గోల్నాక, జనవరి 20 : పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన కేసీఆర్ నాడు వారు అడక్కుండానే మూడు సార్లు జీతాలు పెంచారని అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తు చేశారు. వారి సేవలకు వెలకట్టలేమన్న ఆయన వారికి ఎంత చేసినా తక్కేవేనని అన్నారు. మంగళవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నరెడ్కో సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే చొరవతో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, డీఎంసీ మారుతీదివాకర్, కార్పొరేటర్లు విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్ రెడ్డి, వై.అమృత, ఉమారమేష్ యాదవ్ తదితరులతో కలసి ఎమ్మెల్యే హాజరయ్యారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 9వందల మంది పారిశుధ్య కార్మికులకు ష్వట్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరిచిపో లేమని అన్నారు. వారి ఆత్మగౌరవం కోసం పారిశుధ్య కార్మికులకు బదులుగా ఇంజనీర్లుగా నామకరణ చేసి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కీలక ప్రతిపాదన చేశారు.
అంబర్ పేటలో ఖాలీగా ఉన్న సీపీఎల్ భూమి కేటాయింపు విషయంపై ఇటీవల బతుకమ్మకుంట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదంచిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. త్వరలోనే సీపీఎల్ భూమి దక్కే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగు నరెడ్కో సంస్థ కరోనా సమయంలో, వరదల సమయంలో వేలాది మందికి ఆహారం అందించి ఆదుకున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.