గోల్నాక, డిసెంబర్ 30: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను సైతం అద్దంలా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ న్యూప్రేమ్నగర్ లింగారావుగల్లీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజవకర్గ వ్యాప్తంగా కొత్తగా ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు కాలనీ, బస్తీ తేడాలేకుండా అంతర్గత రహదారులను సైతం అద్దంలా తీర్చిదిద్దుతున్నామన్నారు.
దీంతో పాటు తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్ల ప్రక్షాళన, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీహాళ్ల ఏర్పాటు వంటి పనులు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి నేటి అవసరాలకు అనుగుణంగా పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గత పదిహేనేండ్లలో జరగని అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధి కేవలం మూడున్నర ఏండ్లలో చేట్టామని తెలిపారు. నియోజవకర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.
నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా మారిన ముంపు సమస్యకు సైతం త్వరలోనే మోక్షం కల్పిస్తామని తెలిపారు. కేవలం న్యూప్రేమ్నగర్లోనే రూ.1కోటి50లక్షల వ్యయంతో డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ వ్యవస్థ పనులు చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అనంతరం కాలనీలో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు సీసీ రోడ్డు నిర్మాణంకు ముందే అవసరమైతే తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్లను కలుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ముదిరాజ్, జాఫర్, లవంగు ఆంజనేయులు, లింగారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.