గోల్నాక, అక్టోబర్ 9: ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాకా బీఆర్ఎస్ పోరాటం అగదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి వెళ్లకుండా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతరం అక్కడి నుంచి పోలీసులు అంబర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరువెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోరాడితే అసహనంతో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అరెస్టులు చేస్తూ బీఆర్ఎస్ గొంతు నొక్కాలన్ని ప్రయత్నిస్తోందని అన్నారు.
జంట నగరాల్లో ఆర్టీసీ చార్జీలను ఒకే సారి రూ.10 పెంచి పేద, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించకుండా ప్రజల నడ్టి విరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్, బి.పద్మావెంకట్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.