గోల్నాక, మార్చి 25: అంబర్‌పేట నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) తెలిపారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొత్తగా వీధిదీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరాలో సమస్యలతో పాటు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దీంతోపాటు ప్రేమ్‌నగర్‌లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ గుడి విస్తరణ కోసం స్థలం సేకరించామని అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా గుడి ప్రతినిధులు కోరగా.. గుడి పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీటవేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు అభివృద్ధిచేశారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మైలారం రాజు, భాస్కర్ గౌడ్, ఈశ్వర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామారావుయాదవ్, లింగారావు, వంజరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.