అంబర్‌పేట, నవంబర్ 8 : అంబర్‌పేట ఛే నంబర్లో ఫ్లైఓవర్ కారణంగా వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు దుమ్ము, దూళి ఎక్కువవడం, నిర్మాణ వ్యర్థాలు వంటి వాటి వల్ల చుట్టూ ఉన్న స్థానికులు, దుకాణదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే స్వయంగా ప్రాజెక్టు ఎండీ బాపినీడు, ప్రాజెక్టు డైరెక్టర్ సునీల్, యుటిలిటీ ఇన్చార్జి ప్రసాద్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తెలుసుకున్నారు.
రోడ్డంతా గుంతలుగా మారడంతో తాము నిత్యం ఇక్కట్లు పడుతున్నామని వాహనదారులు ఎమ్మెల్యేకు చెప్పారు. దుమ్ము, ధూళి ఎక్కువగా వస్తుందన్నారు. ఇండ్లలో నివాసముండలేని పరిస్థితి ఉందని తెలిపారు. ట్రాఫిక్ సమస్య కూడా అధికంగా ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.