కాచిగూడ, అక్టోబర్ 6: అంబర్‌పేట నియెజకవర్గంలోని పలు డివిజన్లలో నెలకొన్న అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని దుర్గాసింగ్లైన్, నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి బుధవారం ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకొన్నారు. తాగు నీరు, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పలు బస్తీలలో ఏండ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజీ పైపులైన్ల కారణంగా కలుషిత నీరు వస్తున్నదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే పాత డ్రైనేజీ పైపులైన్‌ను తొలగించి నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులకు తెలిపారు. అదే విధంగా బస్తీ ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక అధ్యక్షుడు కొమ్ము శ్రీను, జలమండలి డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, డీఈ సుధాకర్, శైలేశ్‌కుమార్, జ్యోతి, దేవి, శశిరేఖ, శ్రీకాంత్, శివరాజ్, మనోహర్‌లాల్, రోహిత్, పట్లూరి సతీశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.