అంబర్‌పేట, ఆగస్టు 22 : నిజాం హయాంలో నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అందరికి స్ఫూర్తి దాత అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 152వ జయంతిని నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వైఎంసీఏ జంక్షన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారిగా ఎన్నో విశేషమైన సేవలు అందించారని, రెడ్డి హాస్టల్‌ను నెలకొల్పి తెలంగాణలో విద్యా వ్యాప్తికి, రాజకీయ చైతన్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏండ్లలో వైఎంసీఏ చౌరస్తాను ఎవరూ అభివృద్ధి చేయలేదని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈ జంక్షన్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అంబర్‌పేటకు ముఖ ద్వారం వంటి వైఎంసీఏ జంక్షన్‌ను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి హాస్టల్ మాజీ చైర్మన్ డా.ఎ. రఘుపతిరెడ్డి, సభ్యులు మోహన్‌రెడ్డి, మట్టారెడ్డి, ముత్తంరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.శ్రీరాములుముదిరాజ్, ఎర్రబోలు నర్సింహారెడ్డి, టాం కాం మాజీ చైర్మన్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.