వనస్థలిపురం, నవంబర్ 19 : ప్రభుత్వ దవాఖానలో మందుల కొరతతో ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనస్థలిపురం ఏరియా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సరైన మందులు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వైద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం ఆస్పత్రి అంతా తిరిగి పరిశీలించారు.
ప్రతి నిత్యం 12వందల మంది ఔట్ పేషెంట్లు వస్తారని, నెలకు సుమారుగా 300ల డెలివరీలు జరుగుతాయన్నారు. 3నెలల క్రితం సిటీ స్కాన్ మిషన్‌ను కూడా అందించడం జరిగిందన్నారు. అందుకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ కోసం స్థలం కావాలని ఎన్జీవోస్ కాలనీ సొసైటీని కోరడం జరిగిందని వారు అంగీకరించి స్థలాన్ని కేటాయించారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యులు దామోదర్, జయమాల, రాజన్, అనిల్‌కుమార్, వినయ్‌కుమార్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అరవింద్‌రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.