ఎల్బీనగర్, ఆగస్టు 26: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. గురువారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ రింగ్‌రోడ్డులో అలేఖ్య టవర్స్ నుంచి సాగర్ రింగ్‌రోడ్డు వరకు, సాగర్ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట వరకు నూతన స్కై, ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సూచించారు. సాగర్ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట వరకు దాదాపు 200 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయడం జరిగిందన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, ఇతర విభాగాలకు చెందిన పైప్లైన్లను పక్కకు జరిపించామన్నారు. ఎల్బీనగర్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా భవిష్యత్తులో సాఫీగా ప్రయాణం చేయడానికి పలు కీలకనిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శాంస న్, ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ కార్తిక్, మణి హారిక, రమేశ్‌బాబు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.