ఎల్బీనగర్, ఆగస్టు 15 : కొత్తపేట, మోహన్‌నగర్ గ్రామాల్లో బోనాల జాతర సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారం ఉదయం నుంచి అమ్మవార్లకు బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మోహన్‌నగర్‌లోని శ్రీచిత్తారమ్మ దేవాలయంతో పాటు పోచమ్మ దేవాలయం, కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయంతో పాటు పోచమ్మ ఆలయాల్లో అమ్మవారి బోనాల జాతర సంబురాలు అంబరాన్ని తాకే రీతిలో సాగాయి. శివసత్తుల నృత్యాలు, బ్యాండ్ మేళాల మధ్య అమ్మవారికి బోనాలను సమర్పించారు. బోనాల సంబురాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ పవన్‌కుమార్‌తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాశ్‌గౌడ్, జీవీ సాగర్‌రెడ్డి, నాయకులు లింగాల రాహుల్‌గౌడ్, తోట మహేశ్‌యాదవ్, శివప్రకాశ్, రాగిరి ఉదయ్‌గౌడ్, జహీర్‌ఖాన్, పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తారమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎం. ధన్‌రాజ్, సత్యనారాయణతో పాటు జ్ఞానేశ్వర్, వెంకటేశ్ తదితరులు పూజలు నిర్వహించారు.