ఎల్బీనగర్, ఆగస్టు 13 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, రక్షణ చర్యలు తీసుకుని యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, సకాలంలో బిల్లులు ఇప్పిస్తానని, సెప్టెంబర్ 25లోపు పెండింగ్ బిల్లులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో ఎల్బీనగర్ జోన్‌కు రూ.22కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. కాంట్రాక్టర్లు డ్రైనేజీ పనుల కోసం ఎవరినీ మ్యాన్‌హోల్‌లో దించవద్దని, రాత్రి పూట పనులు చేయించరాదని సూచించారు. అభివృద్ధిలో తనకు తోడుగా ముందుకు నడిస్తే కాంట్రాక్టర్లకు తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ఎస్ఈ అశోక్‌రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.