ఎల్బీనగర్, మే 26: అంబులెన్స్ వాహనాల వారు అధిక చార్జీలు వసూలు చేస్తే వాహనాలను సీజ్ చేయిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోలు, సాహెబ్‌నగర్, భూపేశ్‌గుప్తానగర్ శ్మశాన వాటికలను సందర్శించి సమస్యలతో పాటు దహనసంస్కారాలకు వసూలు చేస్తున్న చార్జీలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రోగులను దవాఖానలకు, మృతదేహాలను దహన సంస్కారాలకు తరలించే విషయంలో అధికంగా చార్జీలు వసూలు చేస్తే సహించబోమన్నారు. విధిగా అంబులెన్స్ సిబ్బంది దూరాన్ని బట్టి రూ.5వేల నుంచి రూ.7వేల వరకు మాత్రమే తీసుకోవాలని సూచించారు.
శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు అధిక ధరలు వసూ లు చేయడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్మశానవాటికల్లో కట్టెమీద కాల్చితే రూ.8వేలు, విద్యుత్ యంత్రం పై అయితే రూ.4వేలు మాత్రమే తీసుకోవాలన్నా రు. శ్మశానవాటికలు, అంబులెన్స్ వారు ఎక్కువ ధరలు వసూలు చేసినట్లయితే ఫోన్ నంబర్ 040-2111111 లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఆయన వెంట హయత్‌నగర్ త్రినేత హనుమాన్ ఆలయ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త మల్లేశ్‌గౌడ్, లోతుకుంట రఘుగౌడ్, సురేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కందికంటి శ్రీనివాస్‌గౌడ్, గ్యారల రాకేశ్‌గౌడ్, పంతుగుల జగదీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.