చంపాపేట, సెప్టెంబర్5: ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాంకేతిక పరమైన ప్రణాళిక సిద్ధం చేశామని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరిధిలోని మెగా ఫంక్షన్హాల్లో డివిజన్లోని సామ సరస్వతి కాలనీ, సూర్యానగర్, పద్మానగర్, న్యూ పద్మానగర్, ఉదయ్‌నగర్, మల్రెడ్డి రంగారెడ్డినగర్ కాలనీవాసులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సమావేశం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగువన ఉండే జిల్లాలగూడ, లెనిన్ నగర్, బాలాపూర్ ప్రాంతాల్లో చెరువులు నిండి దిగువ ప్రాంతాలకు వరదనీరు పారుతున్న పరిస్థితి ఉందన్నారు.
ఇంత ఉధృతితో వచ్చే నీటి సమస్యను పరిష్కరించడానికి లోతైన, విస్తారమైన నాలా నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ప్రైవేట్ ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానవేత్తలతో పక్కాగా ప్రణాళిక తయారు చేసి మంత్రి కేటీఆర్ ఆమోదం కోసం పంపించామన్నారు. ఆమోదం వస్తే త్వరలో ఎల్బీనగర్ కాలనీల ప్రజల అంగీకారం మేరకు రూ.140 కోట్ల నిధులతో ముంపునకు గురయ్యే కాలనీల మీదుగా మూసీనది వరకు వరదనీటి కాలువల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాబోయే ఏడాది కాలంలో సకల సౌకర్యాలతో ఫతుల్లా గూడలోని శ్మశానవాటిక, నియోజకవర్గంలోని ప్రధాన చౌరస్తాల్లో ఆరు బస్ టర్మినల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, మాజీ వార్డు సభ్యులు మాధవి రెడ్డి, ముడుపు రాజిరెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్త చేగోని మల్లేశ్ గౌడ్, నాయకులు గూడూరు గౌతంరెడ్డి, నిష్కాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.