బేగంపేట, మే 28: ‘రెండు రోజులు ఆగు నీ పని చెబుతా.. నిన్ను ఎక్కడ నిల్చోబెట్టాలో అక్కడ నిల్చోబెడతా.. రెండు రోజుల్లో నీ పని చెప్తా’.. అంటూ ఓ మహిళా అధికారిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులకు, జీహెచ్ఎంసీ జెడ్సీకి, డీసీకి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వివరాలివి.. బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని వెల్కిన్ పార్క్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఆక్రమణల తొలగింపు విషయమై బేగంపేట సర్కిల్ టౌన్ ప్లానింగ్‌కు ఫిర్యాదులు అందాయి.
టౌన్ ప్లానింగ్ డీసీపీ సుష్మిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న వాటిని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మరుసటి రోజు వాటిపై కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ ముందు రోజు రాత్రి తెలియడంతో ఎంఎస్సీ ఆదేశాల మేరకు కూల్చివేతల నిర్ణయాన్ని విరమించుకున్నారు. కూల్చివేతలు చేయకపోవడంపై ఈ నెల 21న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అనుచరుడు సుదీప్ పటేల్ బేగంపేట డిప్యూటీ కమిషనర్ చాంబర్‌కు వచ్చాడు.
అదే సమయంలో డీసీ తన చాంబర్‌కు టౌన్ ప్లానింగ్ డీసీపీని పిలిపించారు. ఆమె వివరణతో కూడిన లెటర్ ఇచ్చే లోగానే ఆమెపై సుదీప్ పటేల్ చెలరేగిపోయాడు. టౌన్ ప్లానింగ్ డీసీపీతో పాటు ఎంఎస్సీని అమర్యాదగా, అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. తీవ్ర మనస్తాపం చెందిన సుష్మిత సుదీప్ పటేల్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ రాయాలంటూ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు.
ఈ మేరకు ఆయన జరిగిన ఘటనపై నార్త్ జోన్ డీసీపీకి సుదీప్ పటేల్ పై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. సుష్మిత వెస్టమారేడ్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. కాగా, మానసికంగా కుంగిపోయిన సుస్మిత డిప్రెషన్ లోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.