బంజారాహిల్స్, అక్టోబర్ 23 : టీఆర్ఎస్ ప్లీనరీకి వస్తున్న ప్రతినిధులు, నేతలకు ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ రుఫున ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అక్టోబర్ 25న ప్లీనరీ రోజున స్వాగత వేదికల ఏర్పాట్లు, 27న నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం జూబ్లీహిల్స్ డివిజన్లోని ఫిలింనగర్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో నిలిపేలా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలంతా నడుం బిగించాలన్నారు.
ప్లీనరీతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో అక్టోబర్ 27న నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ప్లీనరీలో చర్చించిన అంశాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నియోజకవర్గం సమావేశంలో చర్చించామన్నారు. సమావేశానికి ఎంపిక చేసిన నాయకులు మాత్రమే రావాల్సి ఉంటుందని, వారికి ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తారని తెలిపారు.
అక్టోబర్ 25న ప్లీనరీకి వెళ్లేదారి పొడువుగా భారీ ఎత్తున స్వాగత వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ సంస్కృతికి మారుపేరైన బోనాలు, బతుకమ్మలు, బంజారా నృత్యాలతో ప్రతినిధులకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. సోమాజిగూడ రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం. 36 నీరూస్ చౌరస్తాదాకా పండుగ వాతావరణం ఉండేలా చూస్తున్నామన్నారు.
ఎక్కడికక్కడ స్వాగతవేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఆయా వేదికల వద్ద ఉదయం ఏడున్నర నుంచే కార్యకర్తలు చేరుకుని స్వాగతం పలకాలని సూచించారు. నవంబర్ 15న వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న ప్లీనరీ బహిరంగసభకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్, నగేశ్సాగర్, అశోక్, అబ్దుల్ ఘనీ, దీపాదేవి, పద్మ, జ్యోతి, హనుమమ్మ పాల్గొన్నారు.