బంజారాహిల్స్,సెప్టెంబర్ 20 : పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా టీఆర్ఎస్ పార్టీ కమిటీలు పని చేస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమవారం ఫిలింనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బస్తీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని, డివిజన్ కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామన్నారు. డివిజన్ ప్రధాన కమిటీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, యూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, సోషల్‌మీడియా కమిటీలను కూడా నియమిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికి పదవులు ఇస్తామని, ప్రజలల్లో ఉంటూ వారి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని తనకు పలువురు నేతలు వినతిపత్రాలు ఇచ్చారని, వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వారికి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. అన్ని కమిటీల ఏర్పాటు మరో వారం రోజుల్లోగా పూర్తి చేసేందుకు కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. బస్తీ , డివిజన్ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమయ్యేలా చూస్తామని, తద్వారా పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై వారి వద్ద నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని వివరించారు.