బంజారాహిల్స్,జూన్ 6: బస్తీలు, కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్సింగ్నగర్, స్వామి వివేకానందనగర్, బాబు నాయుడు నగర్, బసవతారకం నగర్ బస్తీల్లో స్థానికుల సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌తో పాటు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. స్వామి వివేకానందనగర్ బస్తీలోని కమ్యూనిటీహాల్లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నదని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్వామి వివేకానందనగర్ నుంచి బాబునాయుడు నగర్ బస్తీకి కనెక్టింగ్ రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జ్ఞానీజైల్ సింగ్నగర్బస్తీలో కొన్ని ఇండ్లకు తాగునీరు సరిగా రావడం లేదని స్థానిక మహిళలు ఫిర్యాదు చేయగా వెంటనే ఆయా ప్రాంతాల్లో బూస్టర్లను ఏర్పాటు చేసి లో ప్రెషర్ సమస్యలు తొలగించాలని జలమండలి జీఎం హరిశంకర్‌ను ఆదేశించారు. బస్తీలో రోడ్లు పాడైపోయాయని ప్యాచ్‌వర్క్ చేయించాలని ఎమ్మెల్యే సూచించారు. తాము రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నామని, ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డులు రాలేదని కొంతమంది స్థానికులు కోరగా త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్కు తప్ప ఇతర పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అభివృద్ధి అయినా, సంక్షేమంలో అయినా తెలంగాణ రాష్ట్రంతో పోటీపడే సత్తా దేశంలోని ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఈఈ విజయ్‌కుమార్, ఏఈ వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, అశోక్, సంపంగి కిరణ్, సుధాకర్‌రెడ్డి. రాములు, అబ్దుల్ ఘనీ, ఒర్సు శ్రీను,పద్మ పాల్గొన్నారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని గౌరీశంకర్ కాలనీలో రూ.42లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డుపనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. బస్తీలు. కాలనీల్లో పెండింగ్ అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.