కాప్రా, డిసెంబరు 3 : అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డుకాదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా తహసీల్ కార్యాలయం వద్ద అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకున్న వారిలో దివ్యాంగులది ప్రత్యేక, విశిష్ఠమైన స్థానం అని అన్నారు. దివ్యాంగులను వారికేది ఇష్టమో తెల్సుకొని ఆ విభాగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తే తప్పకుండా ఉన్నతస్థాయికి చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు బైరి నవీన్‌గౌడ్, కార్యక్రమం నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.