మియాపూర్ , సెప్టెంబరు 11 : పర్యావరణ పరిరక్షణకు చెరువులు కలుషితం కాకుండా ఈ సారి వినాయక నిమజ్జనాలకు ప్రత్యేక బేబీ పాండ్లలో వేయాలని ప్రభుత్వ విప అరెకపూడి గాంధీ సూచించారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వద్ద కొలనులో నిమజ్జన ఏర్పాట్లను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నియోజకవర్గవ్యాప్తంగా చెరువులకు సమీపంలో ఉన్న నిమజ్జన కొలనులను పూర్తిగా సుందరీకరించి వసతులతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
కొలనుల వద్ద క్రేన్లు, తాగునీరు, పోలీసు బందోబస్తు, మూత్రశాలలు వంటివి కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిమజ్జనం పూర్తయిన పిదప వ్యర్థాలను తొలగించే పనులు పకడ్బందీగా చేపట్టాలలన్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు, నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విప్ గాంధీ సూచించారు. కొలనుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా విభాగాల సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్దన్, మహదేవ్, సత్యనారాయణ, పార్టీ నేతలు శ్రీనివాస్, పోతుల రాజేందర్,అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్ పేర్కొన్నారు. చెరువులు కలుషితం కాకుండా ప్రత్యేకంగా బేబీ పాండ్లను నిమజ్జనాలకు అన్ని వసతులతో అందుబాటులో ఉంచామన్నారు. జోన్ పరిధిలోని పలు సర్కిళ్లలో జడ్సీ పర్యటించి నిమజ్జన కొలనుల వద్ద ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. జోన్ వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాలలో వినాయక ప్రతిమల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు అందులో 8 బేబీ పాండ్లే ఉన్నాయన్నారు.
కేవలం విగ్రహాలను మాత్రమే కొలనులో నిమజ్జనం చేయాలని, పూజా సామగ్రి, పత్రిని కొలను బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక బిన్లలో వేయాలని సూచించారు. నిమజ్జనం పూర్తి చేసుకున్న విగ్రహాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు జోన్ వ్యాప్తంగా 43 వాహనాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. రెండో రోజు నామమాత్రంగానే ప్రతిమలు నిమజ్జనానికి వచ్చాయని, ఆదివారం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా పూర్తి సంసిద్ధతతో ఉంటామని జడ్సీ వెల్లడించారు.